Monday, November 16, 2009

బద్ధకం- శారీరక శ్రమ

ఆదివారం కదా! శెలవు రోజు. మధ్యాహ్నం సుష్టుగా భోంచేసి పడకేశాను. లేచేసరికి నాలుగయ్యింది! బద్ధకంగా వుంది. మా ఇంటి పెరటి వైపు మెట్లపై కూర్చున్నాను. చల్లటి గాలి తగులుతోంది. తులసికోట ప్రక్కనున్న మట్టి జాగాలో గడ్డి, ఏవో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. అక్కడక్కడ కనకాంబర మొక్కలు మాత్రం పొడవుగా పెరిగి పూలతోవున్న తలలను గాలికి వూపుతున్నాయ్! ఆ జాగాని కాస్త శుభ్రం చేస్తే తోటకూర లాంటి ఆకు కూరలు పెంచుకోవచ్చు కదా! కాస్త శరీరానికి పరిశ్రమ! నాలోని బద్ధకస్తుణ్ణి కాసేపైనా తరిమేయవచ్చు!
ఇంతలో ఆశ్చర్యం ఓ చిన్న పిచ్చుక లాంటి పక్షి ( పిచ్చుకలు చూసి చాలాకాలం అయ్యింది!) ఏభయం లేకుండా నాకు దగ్గరలోనే గెంతుతూ అక్కదే పెరిగిన గడ్ది పోచల్ని నోట కరుచుకొని దూరంగా కనబడుతున్న తాటిచెట్టు మీదకు ఎగిరిపోయింది. మరలా వచ్చింది, మరో గడ్డి పోచతో వెళ్ళింది! ఇలా అక్కడున్న కాసేపట్లో సుమారు ఓ డజను సార్లు జరిగింది- బహుశా గూడు కట్టుకుంటోందనుకుంటా. అంత చిన్న పక్షి రెక్కల్లో ఎంత బలముంది! తన పనిలో ఎంత నిజాయితీ, ఎంత నిబద్ధత! అలా అది ఎన్ని రోజులు నుంచి చేస్తోందో? అంత చక్కని శారీరక శ్రమ ఉంటే ఏ జబ్బులు ఎవరికి మాత్రం దరిచేర్తాయ్? మనుషులు ఎంత సోమరులుగా మారిపోతున్నారు! అందుకేనేమో మనకు రకరకాల జబ్బులు! శ్రమించడానికి మనం ఓప్పుకోం. ఆఫీసు ఎ.సి.,ఇల్లు ఎ.సి, సినిమా హాలు ఎ.సి., చివరికి మన కారుక్కుడా ఎ.సి. ఉండాలి! ఎంత సుఖానికి అలవాటు పడిపోయాం! టెక్నాలజీ మహిమ! అందుకే జబ్బులు మన చుట్టాలయ్యాయ్! అందులో మధుమేహం లాంటి జబ్బులు విజృంభిస్తున్నాయ్! ప్రపంచంలో మధుమేహ పీడితులు దక్షిణాసియాలో ఎక్కువట! అందులో ఇండియాలో, ఆతరువాత ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువట! దీనికి అనేక కారణాలుండొచ్చు-కానీ శ్రమించకపోవడం కూడా ఒక కారణం!
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నేను ఆ స్థలం శుభ్రం చేయలేదు - ఆ ఫిచ్చుకకు గడ్డి కావాలిగా మరి! నాలోని బద్ధకస్తుడు విజయం సాధించాడు!

No comments: