Monday, September 28, 2009

ముఖ్య మంత్రినై ఏం చేద్దామనో?

కాంగ్రెస్లో ఓ వర్గం వారు  జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని, రెండో వర్గం వారు అధిష్టానిదే నిర్ణయం అనీ పోరాడుతున్నారు! పాపం ఇక్కడ ప్రజాభీష్టం అంటూ ఏమీ లేదు! 'ఎంతో అనుభవజ్ఞుడైన రోశయ్యగారు పాలించలేరు, జగనే రాష్ట్రానికి దిక్కు 'అన్నట్లు మొదటి వర్గం వారి భావన! దీన్ని నిశితంగా పరిశీలిస్తే జగన్ వర్గం వారి స్వార్ధం మాత్రమే కనబడుతోంది! ఇంతవరకూ కనీసం జగన్ కూడా
" నేను ముఖ్య మంత్రినేమిటి? నాకున్న అనుభవం ఏపాటిది? సీనియర్ల తరువాతే నేను! తండ్రి పోయిన బాధలో వున్నాన్నేను!" అని ఓ ప్రకటన ఇస్తే ఎంత హుందాగా వుంటుంది?- కాని అతను కూడా  ముఖ్య మంత్రినైపోదామని ఎదురు చూస్తున్నట్లుంది! ఏం చేద్దామనో? ఎలా పరిపాలిద్దామనో?   

Saturday, September 26, 2009

అడవిలో స్మృతివనం!

నల్లమలలో మరణించిన వైయస్సార్ జ్ఞాపకార్థం ఓ స్మృతివనం అక్కడే 1412.12 హెక్టారుల్లో నిర్మిస్తారుట! -కేబినెట్ నిర్ణయం! - మంచిదే! దీనికోసం 3.15 కోట్లు ( ముందుగా ) ప్రజాధనం కేటాయించారు! - బాధ లేదు! బాధ పడాల్సిందల్లా ఇప్పటివరకూ బాగావున్న, దట్టమైన అరణ్యం ఏమవుతుంది? రోడ్లకోసం, కాటేజీలకోసం విశృంఖలంగా అక్కడున్న చెట్లను నరికేయడం, ఆ తర్వాత జనసంచారం వల్ల వన్యమృగాలకు రక్షణ లేక అంతరించిపోవడం, పార్కు చుట్టూ వుండే స్థలాల రాజకీయ ఆక్రమణలు.........ఓహ్! పర్యావరణం దెబ్బతింటుందేమో? అటవీ విస్తీర్ణం తగ్గిపోదూ? ఎలాగూ కాంక్రీటు జంగిళ్ళలో భారీ విగ్రహాలు (ఆప్రక్కనే ప్రస్తుతం వున్న జాతిపిత విగ్రహాలు చిన్నబోయేలా!) స్థాపిస్తూ స్వామి భక్తి చాటుకుంటున్నారు కదా! ఇంకొన్ని కూడా సిటీలలో అన్నిసందుల్లో నిర్మించుకుంటే పోయె! 
అడవి మీద పడడం ఎందుకు? ఏమంటారు?

Monday, September 21, 2009

నా మనసులో ఓ సందేహం?

మళ్ళీ యధాలాపంగా నా మనసులో ఓ సందేహం తొలుస్తోంది!
పుణ్యక్షేత్రాలవద్దే కాకుండా చిన్నచిన్న గుడులవద్ద, మసీదులవద్ద, చర్చిలవద్ద కూడా ఈమధ్య భక్తప్రవాహం ఎక్కువగా చూస్తున్నాం! పర్వదినాలలో ఐతే  మరీను! దీనికి కారణం ఏమిటంటారు?
 ప్రజల్లో భక్తి ఎక్కువయ్యిందా?
 పాపభీతి పెరిగిపోతోందా?
 తప్పులు చేస్తూ దేవుడిని ప్రార్దిస్తే పోతాయని భావనా?
 జనాభా పెరుగుదలే కారణమా?
 లేక ఇదీ ఓక ఫ్యాషన్ గా భావిస్తున్నారా?
        

Firefox 3.5.3 Browser లో 'లేఖిని' తెరుచుకోవటం లేదు!

మిత్రులారా! నేను Firefox 3.5.3 Browser వాడుతున్నాను. అందులో లేఖిని తెరుచుకోవటం లేదు!
మిగిలిన Browsers like Opera 10, Internet Explorer 8 లో లేఖిని open అవుతోంది!
కారణం తెలపగలరు!       

Saturday, September 19, 2009

కల ఎంత తియ్యన! మరి నిజం ఎప్పుడూ చేదేనా?

నేను చాలా గర్వపడుతున్నాను!
 గాంధీ పుట్టినదేశం లో పుట్టినందుకు , నెహ్రూ కలలుగన్న ప్రజాశ్వామ్యంలో జీవిస్తున్నందుకు!

నా ఈ దేశంలో
అవినీతి లేదు! నల్లధనం అసలే లేదు! (ఒకప్పుడు వుండేదట- స్విస్ బ్యాంక్ లో!)
బంధుప్రీతి లేదు! కుల, మత, వర్గ విచక్ష ణ అసలే లేదు! ( ఒకప్పుడు వుండేదట!)
నాయకులు ప్రజలవద్దకే వచ్చి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తారు! (సమస్యలు వుంటే!)
పంటలు పుష్కలం! ధరలు ఎపుడూ స్థిరంగానే వుంటాయి! (నల్ల బజారు అంటే ఏమిటో తెలీదు!)
ప్రజలు కష్టజీవులు! అక్షరాస్యులు! పిల్లలందరూ బడికెళ్తారు!
తాగునీటికి, పంటలకు నీరు పుష్కలం!
నదుల అనుసంధానం జరగడం వల్ల వరదలు లేవు!
అనారోగ్యాలు లేవు- ఎందుకంటే ' మందు' లేదు కనుక!
నేరాలు లేవు! శిక్షలూ లేవు! (ఏసిడ్ దాడులూ లేవు!కత్తిపోట్లు అసలే లేవు-సినిమాల్లో తప్ప!)
ప్రజలంతా క్రమశిక్షణతో మెలుగుతారు!- నేను కూడా!............

.............అబ్బ!వర్షాకాలం లో కూడా ఉక్కపోత! కరెంటు ఎప్పుడు పోయిందో?
అమ్మో!ఆఫీసుకు లేట్ అవుతుందేమో? కళ్ళు నులుపుకుంటూ లేచాను!
తలుపు తీసి గేట్లో పడివున్న పేపరు చూసాను!
రాజమండ్రిలో మరో మానవ మృగం! ప్రేమ పరువు తీసే మరో కిరాతక సంఘటన, వంచన!

అంటే మనకింకా స్వతంత్ర్యం రాలేదన్నమాట!

ఆహా! కల ఎంత తియ్యన! మరి నిజం ఎప్పుడూ చేదేనా?


        


  

Tuesday, September 15, 2009

ఇంజనీర్స్ డే

   నెటిజెన్లందరికీ ' ఇంజనీర్స్ డే' శుభాకాంక్షలు!

 ఈరోజు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి.     

Sunday, September 13, 2009

రాజరిక ప్రజాస్వామ్యమా?

రాజరిక ప్రజాస్వామ్యమా?

నాకు తెలిసి అనువంశికపాలన అన్నది పూర్వం రాజరిక వ్య్వవస్థలో ఉండేది.
కానీ నేటి మన ప్రజాస్వామ్యం లో ఒక సామాన్య పంచాయతి బోర్డు మెంబరు
నుండి ముఖ్యమంత్రి వరకు ఈ అనువంశికపాలన అన్నది అమలవుతోంది!
సానుభూతి అన్నది దేనికైనా పనికిరావచ్చేమో కాని పదవీనిర్ణయానికి మాత్రం
పనికిరాదు! అందునా ముఖ్యమంత్రి లాంటి పదవికి అసలే పనికిరాదు!
2003లో కీర్తిశేషులు రాజశేఖరరెడ్డిగారు వేల మైళ్ళు కాలి నడకన ప్రజల్లోకి
వెళ్ళి ప్రజానాడి కనుక్కుంటే తప్ప ఏ పధకాలు ప్రజలకు వుపయోగ పడతాయో
తెలుసుకోలేక పోయారు! అవి ప్రవేశపెట్టి, అమలుచేసికదా ఆయన గొప్ప వ్యక్తి
అయ్యారు, కాంగ్రెస్ను బతికించారు! మరి జగను కు ఏమి అనుభవం ఉంది?
ఆయన కనీసం ఇప్పటివరకుఓ మంత్రిగా కూడా లేరే! వెనకటికి లాలూప్రసాదు
 ఆయన భార్యను సి ఎం చేసారు!ఐతే ఆయనే పరిపాలించేరు! మరిపుడో?
ఇది కీర్తిశేషులు రాజశేఖరరెడ్డిగారి వర్గం తమ పదవులు కాపాడుకోడానికి
రాజకీయం తప్ప మరొకటి కాదు!

ఓ ఐఏఎస్ చనిపోతే ఆ పదవి వారి కుటుంబానికి వెంటనే ఇస్తే ఎంత విడ్డూరమో
ఇది అంతకంటే ప్రమాదం! కాదంటారా?     
               

Saturday, September 12, 2009

ఎక్కడుందో చెప్పగలరా?

మనం చూస్తున్న చిత్రం ఓ నగర ముఖ్య బజారు!
ఇక్కడ వాహనాలకు (సైకిలు కూడా) ప్రవేశం లేదు!
ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు నిషేధం!
బజారు మధ్యలో అంతా పార్కు!
బజారులో రహదారి అంతా మనింట్లో గచ్చు కన్నా శుభ్రం!
పొరపాటున మనం ఏదైనా  వేస్తే పోలీసు చలానాతో రెడీ!
ఈ బజారు ఎక్కడుందో చెప్పగలరా?
                                                           

సిగ్గు సిగ్గు

       ఈనెల మొదటి వారం లో మన ముఖ్యమంత్రి దుర్మరణం ఒక విచారకరమైన, దిగ్బ్రాంతికరమైన విషయం!
అంతకన్నా ఘోరమైన విషయం ఏమిటంటే సుమారు ఓ రెండొందలు పైగా అభిమానులు ప్రాణాలు కోల్పోవడం!
ప్రాణాలకు విలువ ఇంతేనా? ఇంత బలహీనమైన గుండెలా మనవి? ఎవరికోసం ఈ ప్రాణత్యాగాలు?పోయినవారి సన్నిహితులు, స్నేహితులు, చివరికి వారి కుటుంబ సభ్యులు అందరూ బాగానే వున్నారే?
చనిపోయి ఏమి సాధిస్తారో? ఎవరిని సాధిస్తారో? ఇటువంటి బలహీనమైన మనసున్నవారికి చికిత్స
అవసరమేమో? దీంట్లో కొంత పాత్ర వార్తా చానళ్లదీను!చూపిందే చూపిస్తూ సినిమా పాటల్తో, విచారకరమైన
సంగీతంతో పోటీపడి ప్రసారాలు చేసారు! దీన్ని  అభిమానం అనేకంటే దురభిమానం అంతే సరిపోతుంది!
చనిపోయినవారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం!  
ఏమంటారు?