ప్రియమైన నేస్తమా! బాగున్నావా?
నేనెవరా అని ఆలోచిస్తున్నావా?
అవునులే నాలాంటి అల్పులు నీకెందుకు గుర్తుంటారు!
ఈ రోజున నాతో నీకేం పని? నీ busy life లో నేనెంత?
ఈ విషయంలో నిజంగా నీపై ఓ మిత్రుడిగా నా ప్రగాఢ సానుభూతి!
ఆ రోజుల్లో..........
నీ తోనే నా జీవితం! నీ ఇంట్లోనే నా నివాసం కూడా!
నువ్వు పండించే పంట గింజల్ని ముందు నాకే రుచి చూపించేవాడివి కదూ!
నీ పంటలపై కీటకాలను తింటూ, నీతోనే, నీ ఇంట్లోనే, నీ వారి మధ్య ఆడుతూ, పాడుతూ ఉండేదాన్ని!
ఉదయాన్నే నా కిచకిచలతో నిన్ను, నీవాళ్లనూ నిద్ర లేపేదాన్ని! నా సందడి లేని ఏ లోగిలి ఐనా ఉండేదా?
నా కోసం అప్పుడప్పుడు చిన్నచిన్న గూళ్లు కూడా అమర్చేవాడివి!
నీ ఇంటి చూరులో, వెంటిలేటర్లలో, అటకల మీద.....ఓహ్ ఎక్కడైనా adjust అయ్యేదాన్ని!
........కాని
ఊహకందనంతటి వేగంగా నావాళ్లందరూ ఒక్కొక్కరూ నన్ను విడిచిపోయారు(?)
ఎక్కడో, ఎప్పుడో కాని కనబడరు! అదీ నిశ్తేజంగా, నిస్సారంగా....ఒకటీ..అరా!
~ ఏవో సెల్ ఫోను టవర్లట! దానినుండి వచ్చే రేడియేషన్ లాంటిదేదో మేము అంతరించడానికి కారణమట!-ఏమో?
మారుమూల పల్లెటూర్లలోనూ నావాళ్లు కనపడుటలేదు (ఆ రేడియేషనేదో నీకు హాని చేస్తుందేమో? జర జాగ్రత్త!)
~ ఎరువుల,పురుగులమందుల పంటలట! (ఆ పురుగులను, పంటలను తిని మా వాళ్లు.....?)
~ పట్టణాలు, నగరాలు ఇప్పుడు పూర్తి కాంక్రీటు జంగిల్స్ కదా!
-అందుకనేనా నా వాళ్లు నన్నూ, నిన్నూ కూడా వదిలేశారు?-ఏమో?
~ లేక ఈ అల్ప ప్రాణి మీద నీకు తెలియకుండానే ఏ టెక్నాలజీ బ్రహ్మాస్త్రాన్నైనా ప్రయోగించావా?...... ఏమో?
...... ఏది ఏమైనా ఇది ఇలాగే కొనసాగితే నేను ఇక పూర్తిగా కనబడను. కనీసం నా బొమ్మనైనా నీ హాల్లో షోకేసు లో గుర్తుగానైనా పెట్టుకో నేస్తమా!
అంతర్థానమైన అనేక జీవులలాగే నేను కూడా...
నేనేకాదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు నీవు కూడా....!!!
జాగ్రత్త మిత్రమా! ఉంటాను.
ఎప్పటికీ నీ నేస్తం... నీ కిచకిచల "పిచ్చుక" (House Sparrow)